MCN NEWS : ఎన్నికల కమీషన్ శనివారం జారీచేసిన షెడ్యూల్ ప్రకారం 2024 సాధారణ ఎన్నికల 4వ దశలో జిల్లాలోని కాకినాడ పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన సాధారణ ఎన్నికల-2024 షెడ్యూల్ కనుగుణంగా జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ శనివారం సాయంత్రం కలెక్టరేట్ ఎన్నికల కంట్రోల్ రూమ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమీషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం సాధారణ ఎన్నికలు-2024 నాల్గవ దశలో కాకినాడ జిల్లాలోని ఒక పార్లమెంట్, 7 శాసన సభా నియోజక వర్గాలకు ఎన్నికల నిర్వహణకు ఏప్రిల్ 18వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన జరుగుతాయని, అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణకు ఏప్రిల్ 29 ఆఖరు తేదీ అని తెలిపారు. తదుపరి మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతాయని, మొత్తం ఎన్నికల ప్రక్రియ జూన్ 6వ తేదీతో ముగుస్తుందని తెలియజేశారు. కాకినాడ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను చేపట్టామని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,637 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఇందులో 467 అర్బన్ ప్రాంతల్లోను, 1170 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లు సులువుగా చేరుకునే ప్రాంతాల్లోనే ఉన్నాయని, వీటిలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన సదుపాయాలు సమగ్రంగా కల్పించామన్నారు. ఎన్నికల నిర్వహణకు మొత్తం 12,600 మంది సిబ్బందిని నియమించి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలో మొత్తం 16,11,031 మంది ఓటర్లు ఉండగా , ఇందులో 8,17,393 మంది మహిళలు, 7,93,455 మంది పురుషులు, 183 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారని తెలిపారు. జిల్లాలో ప్రతి వేయి జనాభాకు 733 మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల లింగనిష్పత్తి ప్రతి వేయి మంది పురుషులకు 1030 మంది మహిళలుగా ఉందని తెలియజేశారు. ఓటరు జాబితాలలో చేర్పులు, తొలగింపులు, మార్పులు కొరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నాటికి అందిన 6వేల ధరఖాస్తులను వారం రోజులలో పరిష్కారం పూర్తి చేస్తామని, ఇకపై షెడ్యూల్ ప్రకటన నుండి నామినేషన్ల స్వీకరణ వరకూ కేవలం కొత్తగా నమోదుల కొరకు మాత్రమే తప్ప తొలగింపులు, మార్పుల కొరకు ధరఖాస్తుల స్వీకరణ ఉండదన్నారు. జిల్లాలో జారీ కావలసిన సుమారు 1 లక్షల ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు ప్రింట్ అయి వచ్చాయని వాటిని వచ్చే 15 రోజులలోపు పోస్టు ద్వారా సంబంధిత ఓటర్లుకు బట్వాడా చేయడం జరుగుతుందన్నారు. ఈ విడత ఎన్నికలలో 85 ఏళ్లు పైబడిన సీనియర్ ఓటర్లు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు వారి ఇంటి వద్దే హోమ్ ఓటింగ్ సదుపాయం ఎన్నికల కమీషన్ కల్పించిందని, వినియోగించుకోదలచిన వారందరికీ రేపటి నుండి ఫారమ్ 12(డి) అందజేస్తామన్నారు. జిల్లాలోని ఓటర్లలో 18,603 మంది దివ్యాంగులు, 85 ఏళ్ల వయసు దాటిన వారు 7,594 మంది, శతాధిక వృద్దులు 8 మంది ఉన్నారన్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలపై వారం వారం రాజకీయ పార్టీల ప్రతినిధులకు పారదర్శంగా సమాచారం అందించేందుకు జిల్లా స్థాయిలోను, ఆర్ఓల స్థాయిలోను 32 మీటింగులు నిర్వహించి, ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు వారి సహకారాన్ని కోరామన్నారు. శనివారం నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని, 24 గంటలలో అన్ని కార్యాలయాలలోను, 48 గంటలలోపు అన్ని పబ్లిక్ ప్రదేశాలలోను, 72 గంటలలో అనుమతి పొందని ప్రయివేట్ ఆస్తుల మీద రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించడం జరుగుతుందన్నారు. ఎంపిడిఓలు, మున్సిపల్ కమీషనర్ల ఆధ్వర్యంలో ప్రతి మండలంలోను, మున్సిపాలిటీలోను మోడల్ కోడ్ అమలు టీములను ఏర్పాటు చేశామని, శనివారం నుండి ఈ టీములు విధులలోకి వచ్చాయన్నారు. ఎన్నికలలో ప్రలోభాలను అరికట్టేందుకు 21 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 21 స్టాటిక్ సర్వేలెన్స్ టీములు, 3 అంతర రాష్ట్ర చెక్ పోస్టులు, 5 అంతర జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసామని, ఎన్నికల కమీషన్ రూపొందించిన ఈఎస్ఎంఎస్ సాఫ్ట్ వేర్ తో అనుసంధానమై ఈ వ్యవస్థలు అక్రమాలపై పటిష్టమైన నిఘా ఉంచుతాయన్నారు. దీనితో పాటు పౌరులు కూడా ఎన్నికలకు సంబంధించి తమ దృష్టికి వచ్చిన అక్రమాలపై సి-విజిల్ యాప్ ద్వారా గాని, 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసిగాని ఎన్నికల యంత్రాంగానికి సమాచారం అందించవచ్చున్నన్నారు. జిల్లా స్థాయిలో 0884-2346599, 0884-2346399 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అదే రీతిలో రిటర్నింగ్ అధికారుల స్థాయిలో కూడా కంట్రోల్ రూములు పనిచేస్తున్నాయన్నారు. జిల్లాలో 2014 ఎన్నికలలో 78 శాతం, 2019 ఎన్నికలలో 76 శాతం పోలింగ్ నమోదైందని, ఓటర్లను చైతన్య పరచి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఓటర్లను చైతన్యపరచడంలోను, ఎన్నికలను ప్రభావితం చేస్తున్న నాలుగు …(యం)- జాడ్యాలు… మనీ, మజుల్ పవర్, మిస్ఇన్ఫర్మేషన్, యంసిసి వయోలేషన్ లను అరికట్టండంలోను ఎన్నికల యంత్రాంగానికి అన్ని విధాల సహకరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి జెఎన్వి భాస్కరరావు, డిఆర్ఓ డా.డి.తిప్పేనాయక్, కాకినాడ మున్సిపల్ కమీషనర్ జె.వెంకటరావు, డిఐపిఆర్ఓ డి.నాగార్జున పాల్గొన్నారు.
కాకినాడ పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు మే 13వ తేదీన పోలింగ్,
ADD
RELATED ARTICLES