MCN NEWS : జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు కుటుంబాలకు పని దినాల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ల, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా.. జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య, వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 2024-25 నిర్వహణ, రెవెన్యూ అంశాలకు సంబంధించి మూడవ దశ రీసర్వే, ఇనామ్, అసైన్డ్ భూములు; హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్స్, జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు పురోగతి, పని దినాలు సంఖ్య, తాగునీరు; వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో అమలవుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ తదితర అంశాలపై.. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి ఈ సందర్భంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాల మేరకు జిల్లాలో అన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు కుటుంబాలకు పని దినాల సంఖ్య పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు. ప్రతిపాదించిన పనులను మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించారన్నారు. వేసవి దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పనులకు కూలీలకు కొరత లేకుండా చూడాలని తాగునీటి సదుపాయం, అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. హౌసింగ్ పనులకు సంబంధించి లక్ష్యం నిర్దేశించుకొని పనుల వేగవంతం చేయాలన్నారు. రోడ్డు రవాణా భద్రతపై జిల్లాలో అవగాహన కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, డీఎం అండ్ హెచ్వో డా జే నరసింహ నాయక్, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డా పీ.రాధాకృష్ణ, ఆర్టీవో పీవీ.సాయి ప్రసాద్, ఏడీ సర్వే బి.లక్ష్మినారాయాణ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఇంతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.